Skip to content

శ్రీ జోగులాంబ దేవి

శ్రీ జోగులాంబ  దేవి - 5వ శక్తి పీఠం - అలంపురం (తెలంగాణ)

జోగులాంబ ఆలయం కర్నూలు పట్టణము కు సమీపంలోని అలంపురంలో ఆగ్నేయదిశగా నెలకొని ఉంది.

పరమపావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి, వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని, దీని సారాంశం. ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరండం, ఆ జీవ కళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఐతిహ్యం. ఇంట్లో జరిగే శుభాశుభాలకు అమ్మవారు ప్రతిరూపం అని, అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండిగా పేర్కొనడం అనాదిగా వస్తోంది. వాస్తుదోష నివారణలకు కూడా అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం.

జోగులాంబ ఆలయాన్ని 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానులు ధ్వంసం చేయగా, జోగులాంబ, చండి, ముండి విగ్రహాలను బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో భద్రపర్చారు. కొద్ది సంవత్సరాల క్రితం జోగులాంబ ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన (ఐదవ శక్తిపీఠం) జోగుళాంబ ఆలయం ఉంది. అమ్మవారిపై దవడ పంటితో ఇక్కడ పడినట్టు పురాణకథనం. జోగులాంబ మహాదేవి, రౌద్ర వీక్షణ లోచన, అలంపురం స్థితమాత, సర్వార్థ ఫల సిద్ధిద అని జోగులాంబ దేవిని ప్రార్థిస్తారు. అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ, ఆలయంలో గల కోనేరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి. మొదట అమ్మవారి విగ్రహం బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉండేది. 2008 లో ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం చేసి అమ్మవారిని అక్కడకు తరలించారు. బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉన్నప్పుడు అమ్మవారిని కిటికీ గుండా చూసేవారు.

9 వ శతాబ్దానికి చెందిన సూర్యనారాయణస్వామి దేవాలయం కూడా ఇదే ప్రాంగణంలో ఉంది. ఇక్కడ విష్ణుమూర్తికి చెందిన సుందరమైన విగ్రహాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ విజయనగర రాజు అయిన కృష్ణదేవరాయలకు చెందిన ఒక నరసింహస్వామి దేవాలయం కూడా ఉంది. అలంపూర్ దగ్గరలో పాపనాశనం అను ఇరవైకి పైబడిన శివాలయములు వివిధ ఆకారం, పరిమాణాలలో ఉన్నాయి. ఇందులో పాపనాశేశ్వర దేవాలయం ప్రధానమైనది.

ఈ శక్తిపీఠాన్ని సందర్శించడానికి వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు.

ఈ దేవాలయాన్ని ఒక్క సారి సందర్శిస్తే మన దురదృష్టం వెళ్లి పోయి అదృష్టం కలుగుతుందని భక్తులు నమ్ముతారు

🌺🙏🌺🙏🌺