Skip to content

శ్రీ కామాక్షి దేవీ

శ్రీ కామాక్షి దేవీ - 2వ శక్తి పీఠం - కాంచీపురం

అష్టాదశ శక్తి పీఠాలలో రెండవది కంచిలోని కామాక్షీదేవి ఆలయం . కంపా నదీ తీరంలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారు శక్తి స్వరూపిణి.. భక్తుల మనోభీష్టాలు నెరవేర్చే అమ్మగా ఆమె ఇక్కడ విలసిల్లింది. ఇక్కడే శ్రీ మహావిష్ణువుతో పాటు దేవతలంతా తమతమ నెలవులను ఏర్పరచుకొన్న పుణ్యపావన క్షేత్రం ఈ శక్తి పీఠం. శ్రీ కామాక్షి దేవి ని 'కామాక్షి తాయి' అని 'కామాక్షి అమ్మణ్ణ్ ' పిలుస్తారు.

పూర్వం ఇక్కడ ఉండే బంగారు కామాక్షి దేవి, ఇప్పుడు తంజావూరులో కొలువుదీరి ఉన్నారు. కాంచీపురంలో భగవత్ శ్రీఆదిశంకరాచార్యులుచే స్థాపించబడిన కంచి కామకోటి పీఠం ఉంది. శ్రీకామాక్షిదేవి ఆలయం ప్రక్కనే కంచి కామకోటి పీఠం ఉంది.

“కా” అంటే “లక్ష్మి”, “మా” అంటే “సరస్వతి”, “అక్షి” అంటే “కన్ను”. కామాక్షి దేవి అంటే లక్ష్మి దేవి మరియు సరస్వతి దేవి ని కన్నులుగా కలది. సోమస్కంద రూపంగా శివ (ఏకాంబరేశ్వర్) , ఉమ (కామాక్షి) మధ్యలో స్కంధుడు (కుమారస్వామి) కొలువుదీరి ఉన్నారు.

చెన్నైకి 70 కి.మీ. దూరంలో గల కంచిక్షేత్రాన్ని కాంచీపురం, కాంజీవరం అని కూడా పిలుస్తారు. చెన్నైనుండి తాంబరం మీదుగా కంచి చేరవచ్చు. దేవాలయాల కేంద్రంగా.. విశిష్ఠ విద్యాకేంద్రంగా గల ఈ కంచిపురంలో సతీదేవి “కంకాళం” పడినట్లు చరిత్రకారుల నమ్మకం.

కామాక్షి అమ్మవారు విగ్రహం యోగముద్రలో పద్మాసనముపై ఆసీనురాలై శాంతిని, సౌభ్రాతృత్వాన్ని వెల్లివిరిస్తూ ఉంటుంది. అమ్మవారు క్రింది హస్తాలతో చెఱకుగడ, పుష్పాలు మరియు చిలుకను, పై చేతులతో పాశాన్ని, అంకుశాన్ని ధరించి ఉంటుంది.

కంచి పట్టణంలో కామాక్షి అమ్మవారి దేవాలయం కాకుండా వేరే అమ్మవారి దేవాలయాలు లేవు. కామాక్షివిలాసం అనే ఇతిహాసం ప్రకారం ఇక్కడ అమ్మవారు శక్తి అంతా గ్రహించింది అని , మరో ఇతిహాసం ప్రకారం రాజరాజేశ్వరి ఆసనంలో ఉండటం వల్ల ఈ అమ్మవారు సృష్టిలో ఉండే అన్ని శక్తులమీద తన ప్రభావం చూపుతుందని చెబుతారు.

స్థల పురాణము:

కామాక్షి అమ్మవారు మామిడి చెట్టు క్రింద మట్టితో శివలింగాన్ని ప్రతిష్టచేసి ఈశ్వరుని పాణి గ్రహణం చేయుటకు ఘోర తపము చేసిందని చెబుతారు. శివుడు పెట్టిన అనేక పరీక్షలకు నిలిచి, ఆయనను మెప్పించి పరిణయమాడినది .

మొదట ప్రసన్నంగ ఉన్న అమ్మవారు, తరువాత కొన్ని పూజా పద్దతులలో వచ్చిన మార్పులు వల్ల చాలా ఉగ్రంగా ఉండి బలులు తీసుకొంటూ ఉంటే ఆదిశంకరాచార్యులు అమ్మవారి పూజా పద్ధతిని సవరించి, అమ్మ ను శంతపరచి, శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు.

భగవత్ శ్రీ ఆది శంకరాచార్యులు కామాక్షి అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం విడిచి వెళ్ళవద్దని అభ్యర్ధించిన కారణంగా, ఉత్సవ కామాక్షి, ప్రాంగణంలోనే ఉన్న శ్రీ ఆది శంకరాచార్యులు అనుమతి తీసుకొని, ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుంది.

ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొనిఉంది. ఇక్కడ ప్రతిరోజూ ప్రాతఃకాలంలో శ్రీ కామాక్షి దేవి ఉత్సవ మూర్తిని మేలుకొలిపి, ప్రాతఃకాల నైవేధ్యం సమర్పించి హారతి ఇచ్చి, కామాక్షిదేవి ఉత్సవ మూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత కామాక్షి దేవి కి ఎదురుగా గోపూజ చేస్తారు. గోపృష్ట భాగం అమ్మవారి వైపు ఉంచి గోపూజ చేస్తారు. గోపూజ అయిన తర్వాత అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలిగించి హారతి యిస్తారు. మనం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు.

శ్రీ కామాక్షి దేవి దివ్య మంగళ రూపం నయన మనోహరంగా ఉంటుంది. ఇంకా ఈ ఆలయంలో వారహి అమ్మవారు, అరూప లక్ష్మి, రూప లక్ష్మి, వినాయకుడు, కల్వనూర్(విష్ణువు), అర్ధనారీశ్వర, అన్నపూర్ణ, రాజ శ్యామలా దేవి, క్షేత్రపాలకుడు అయిన పూర్ణ పుష్కల సమేత ధర్మ శాస్త, కామాక్షి దేవి పూజ పద్ధతిని తొలుత నిర్ణయించిన దుర్వాస మహర్షి, ఆ పద్ధతిని పునః ప్రతిష్ట చేసిన ఆది శంకరులను దర్శనం చేసుకోవచ్చు.

ఈ దేవాలయ ప్రాంగణంలో కుంభస్థలంపై అందంగా అలంకరించబదిన ఏనుగులను కూడా చూడవచ్చు. ఇక్కడ ఉన్న పంచ తీర్థం అనే కోనేరు చాలా విశాలంగా ఉంటుంది. ఈ ఆలయ శిల్పసంపద చాలా రమణీయంగా ఉంటుంది.

🌺🙏🌺🙏🌺