Skip to content

శ్రీ శాంకరీ దేవీ

శ్రీ శాంకరీ దేవీ - ప్రథమ శక్తి పీఠం - శ్రీ లంక

స్థల పురాణము

లంకాధీశుడైన రావణాసురుడు కైలాసం నుంచి పార్వతీదేవిని తన రాజ్యమునకు తీసుకు వెళ్ళాలని భావించి, కైలాసమునకు వెళ్ళి బలవంతంగా పార్వతీ దేవిని తీసుకువెళ్ళే ప్రయత్నం చేయగా, కోపోద్రిక్తురాలైన పార్వతీదేవి రావణాసురుడిని అస్త్రబంధనం చేసింది. దీనితో బలగర్వం నశించిన రావణాసురుడు పార్వతీదేవిని అనేక రకాలుగా భక్తితో ప్రార్థించాడు. రావణాసురుని భక్తికి మెచ్చిన పార్వతీదేవి ప్రసన్నమై వరం కోరుకోమనగా – తన రాజ్యంలో కొలువుదీరి తనను, తన ప్రజలను, రాజ్యమును రక్షిస్తూ వుండమని వరం కోరాడు. అందుకు పార్వతీదేవి –

“రావణా! నీవు అనేక అకృత్యాలు చేస్తున్నావు. అందువల్ల నీ రాజ్యం సముద్రంలో మునిగిపోయి కుచించుకుపోతుంది. నీకు వరం ప్రసాదించి నేను వచ్చి నీ రాజ్యంలో వుంటాను. అయితే నీవు అకృత్యాలు చేయనంతకాలం నేను నీ రాజ్యంలో వుంటాను. నీవు మళ్ళీ అకృత్యాలు చేసిన మరుక్షణం నేను నీ రాజ్యం వదిలివెళ్తాను. నేను వెళ్ళిన తర్వాత నీకు కష్టాలు ప్రారంభమై, నీ పాలన అంతమొందుతుంది.” అని పలికింది.

అందుకు రావణాసురుడు అంగీకరించగా – పార్వతీ దేవి లంకారాజ్యంలో శాంకరీదేవిగా కొలువుదీరి ఆరాధనలందుకో సాగింది.

తర్వాత కొంత కాలానికి రావణాసురుడు సీతాదేవిని తీసుకొనివచ్చి అశోకవనంలో బంధించాడు. ఆ మరునాడు శాంకరీదేవి దర్శనమునకు వెళ్ళి రావణాసురునితో –

“రావణా! సీతాదేవిని బంధించి నీవు తప్పు చేశావు. నీవు ఆమెను వదిలిపెట్టు. లేదంటే నేను నీ రాజ్యం వదిలి వెళ్ళిపోతాను” అని పలికింది.

శాంకరీ దేవి మాటలను రావణాసురుడు ఖాతరు చేయక పోవడంతో లంకను వదిలి వెళ్ళిపోసాగింది. ఈ సమయంలో మహర్షులు లంక వదిలివెళ్ళినా భూలోకం వదలి వెళ్ళవద్దని ప్రార్థించడంతో ఆదేవి దక్షిణం నుంచి ఉత్తరమునకు సాగిపోయి హిమాలయం, కాశ్మీరం మొదలైన క్షేత్రాలలో నిలబడిపోయిందని చెప్తారు. మహర్షులు ఆ దీవిని “బనశంకరీ” అని పిలిచారు. ఆ విధంగా దేవి వెళ్ళిపోవడంతో శక్తిపీఠం కాలగర్భంలో కలిసిపోయిందని భావిస్తారు.కొందరు రావణ సంహారానంతరం శాంకరీ దేవీ తిరిగి లంకలో మహర్షులు చేత ప్రతిష్ఠించబడింది అని భావిస్తారు.

అయితే అనేక వివాదాలు ఉన్న ప్రస్తుతం శ్రీలంక దేశంలోని “ట్రింకోమలి” పట్టణంలో వున్న దేవీ ఆలయమును ప్రథమ శక్తి పీఠంగా భావిస్తున్నారు. ఈ క్షేత్రంలో సతీదేవి కాలిగజ్జెలు పడినట్లు చెప్పబడుతోంది.

శ్రీ శాంకరీ దేవి ఆలయం ,శ్రీలంక తూర్పు ప్రాంతం లోని కోనేశ్వరం లో త్రిముకోమలై వద్ద వుందని చెప్పబడుతుంది . దానినే కొనేశ్వరం శాంకరీదేవి ఆలయంగా కూడా పిలుస్తారు .

అయితే ప్రస్తుతం, ఈ ప్రదేశంలో .. ఏ ఆలయం లేకపోయినా, శ్రీ శాంకరీ దేవి ఆలయం ఖచ్చితంగా వున్నదని చెప్పినచోట, అది వున్నట్లు చూపే గుర్తుగా, ఒక స్తూప స్థంబాన్ని కొండ శిఖరం మీద నిర్మిచారు.

ఈ ఆలయాన్ని 16 -17 శతాబ్దం మధ్య పోర్చుగీస్ వారు నాశనం చేశారు. చరిత్ర ఆధారంగా 17 వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు ఈ ద్వీపాన్ని ముట్టడించారు. కొండ శిఖరం పైన వున్న ఈ ఆలయాన్ని వారి ఓడ నుండే ఫిరంగులతో దాడి చేసి పూర్తిగా నాశనం చేశారు.

అయితే, శాంకరీ దేవి విగ్రహాన్ని, ఆలయం వున్నదని చూపిన స్థలం ప్రక్కనే, ఇప్పుడు ఉన్న శ్రీ త్రికోనేశ్వర (శివ) స్వామి ఆలయంలో భద్రపరచ బడిందని భక్తుల విశ్వాసం.

ఇటీవల నిర్మాణం చేసిన ఈ ఆలయాన్ని, శాంకరీ దేవి ఆలయంగా కంటే కూడా, స్థానికులు శివాలయం గానే భావిస్తారు.

త్రిముకోమలై అంటే “త్రిభుజం ఆకారంలో” వున్న “కొండ” పై ఉండటం వల్ల - ఆ దేవుణ్ణి శ్రీ త్రికోనేశ్వర స్వామిగా పిలుస్తారు.

ఆ శివాలాయం ప్రక్కనే… ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు.. ఆ ఆలయంలోని కొలువైవున్న దేవినే శాంకరీ దేవిగా కొలుస్తున్నారు

🌺🙏🌺🙏🌺