శ్రీ చాముండేశ్వరి దేవీ - 4వ శక్తి పీఠం - మైసూరు (కర్ణాటక)
18 శక్తి పీఠాల్లో నాలుగోది అయిన శ్రీ చాముండేశ్వరి శక్తిపీఠం కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు పట్టణము లో ఉన్నది. ఈ పీఠము లో సతీదేవి తల వెంట్రుకలు పడ్డాయంటారు. ఈ శక్తి పీఠంలో అమ్మవారు దుష్ట సంహారిణిగా, మంగళదాయినిగా, జగన్మాతగా కొలువై ఉంది.
శ్రీ చాముండేశ్వరి దేవీ అన్ని కార్యాలను విజయవంతం చేస్తుందని విశ్వాసం. మైసూరు రాజుల ఇష్టదైవమైన ఈ ఆలయంలో దసరా ఉత్సవాలను వైభవంగా చేస్తుంటారు. ఈ ఉత్సవాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు.
ఆలయ చరిత్ర:
ప్రాచీన కాలంలో ఈ ప్రాంతానికి క్రౌంచపట్టణమని పేరుండేది. అశోకుని కాలంలో ఈ ప్రాంతాన్ని మహిషాసుర మండలమని పిలిచేవారు. ఆధునిక కాలంలో మైసూరు ప్రాంతాన్ని పరిపాలించిన ఉడైయార్ (రాజవంశరాజు) ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. 1895-1940 కాలంలో ఈ దేవాలయం బాగా అభివృద్ధి చెందింది. ఆ కాలంలో చాముండేశ్వరి ఆలయం అత్యంత సుందరమైన ఆలయంగా రూపొందింది.
ప్రచారంలో ఉన్న పురాణ కథ:
పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు కఠోర తపస్సుచే పురుషుల చేతుల్లో మరణించకూడదని పరమేశ్వరుని నుంచి వరాన్ని పొందుతాడు. ఆ వరం పొందిన గర్వంతో సకలలోకాలను పీడించాడు.
ఇంద్రుని జయించి స్వర్గాన్ని కూడా ఆక్రమిస్తాడు. భయభ్రాంతులైన సకలలోకవాసులు త్రిమూర్తులను వేడుకోగా, మహిషాసురుని వధించుటకై శక్తి వెలికివచ్చింది. ఆ శక్తి స్వరూపిణియే చాముండేశ్వరి. 18 చేతులతో ప్రతిచేతిలో ఒక ఆయుధంతో ఆ తల్లి దర్శనమిస్తుంది. మహిషాసురుని వధించి మహిషాసురమర్దినిగా సకలలోక వాసుల కీర్తనలను అందుకుంటుంది.
ఈ శక్తిమాతను దర్శించుకుంటే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంకా సకల సంపదలు, వ్యాపారాభివృద్ధి, ఆయురారోగ్యాలను చాముండేశ్వరి ప్రసాదిస్తుందని విశ్వాసం.
అమ్మ చాముండేశ్వరి దేవీ, “చాముండి కొండ” అనబడే ఒక పర్వతము పై కొలువై ఉంటుంది.
‘స్కంద పురాణం' మరియు ఇతర పురాతన గ్రంథాలు ఈ క్షేత్రాన్ని ఎనిమిది కొండల చుట్టూ ఉన్న 'త్రిముత క్షేత్రం' అనే పవిత్ర ప్రదేశం అని ప్రస్తావించాయి. ఆ ఎనిమిది కొండలలో ఒకటైన ఈ చాముండి కొండ పశ్చిమ దిశలో ఉంటుంది. పూర్వ రోజులలో, ఈ కొండ పై వెలసిన మహాబలేశ్వర స్వామి) గౌరవార్ధం, ఈ కొండను 'మహాబలద్రి' అని అనేవారు.తరువాతి రోజులలో, “దేవి మహత్యం” యొక్క ప్రధాన దేవత చాముండి గౌరవార్థం 'చాముండి కొండా అని పిలువబడింది.
దేశం నలుమూలల నుంచి మరియు విదేశాల్లో నుండి అనేకమంది భక్తులు ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. దేవత వారి కోరికలను నెరవేర్చును.
🌺🙏🌺🙏🌺